నీట్ పేపర్ లీక్ వివాదంపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. నిరసనల సమయంలో వాడిన భాష, ప్రవర్తన 'వాంతులు తెప్పించేలా' ఉన్నాయని, ఆందోళనకారులు సమాజం ముందు చెత్తను ప్రదర్శిస్తున్నారని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నిరసనకారులు తమను తాము బొద్దింకలుగా పిలుచుకుంటూ అలాగే ప్రవర్తిస్తున్నారని, ఈ వీడియోలు చూసి తాను మనోవేదనకు గురయ్యానని కంగనా తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందిస్తూ కంగనాపై ఎదురుదాడికి దిగారు. దేశానికి ఎంపీగా కంగనా చేసిన సేవ కంటే జెన్-జెడ్ తరానికి చెందిన యువత చేసిన పనులే ఎక్కువని ఆయన విమర్శించారు. కంగనాను ఆమె సొంత పార్టీ నాయకులే సీరియస్‌గా తీసుకోవడం లేదని, అటువంటప్పుడు తాము ఆమె వ్యాఖ్యలను ఎందుకు పట్టించుకోవాలని సౌరవ్ దాస్ ప్రశ్నించారు.

ఎంపీ పదవికి పెద్దగా పని ఉండదని కంగనా గతంలోనే స్వయంగా చెప్పిన వీడియోలను సౌరవ్ దాస్ గుర్తుచేశారు. ఈ వీడియోల ద్వారా ఆమెలోని నిబద్ధత లోపాన్ని ఆయన ఎత్తిచూపారు. నిరసనకారుల తీరుపై కంగనా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.