కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాంటా బార్బరా (UCSB)లో కెమికల్ ఇంజినీరింగ్ పీహెచ్‌డీ చేస్తున్న విక్రమ్ ముబాయి, ఆగస్టు 1న బిగ్ పైన్ లేక్స్ ప్రాంతంలో ఒంటరిగా హైకింగ్‌కు బయలుదేరారు. అదే రోజు రాత్రి 8:30 గంటల సమయంలో తన కుటుంబ సభ్యులకు GPS కోఆర్డినేట్స్ పంపి, తాను ఉన్న ప్రదేశాన్ని తెలియజేశారు. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఇన్యో కౌంటీ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం మరియు కాలిఫోర్నియా హైవే పట్రోల్ రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఇన్యో నేషనల్ ఫారెస్ట్ పరిధిలో విక్రమ్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.

విక్రమ్ మరణానికి గల కారణాలపై దర్యాప్తు అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఈ ఘటనలో హత్య లేదా ఇతర అనుమానాస్పద అంశాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మరణంపై దర్యాప్తు కొనసాగుతోంది.