Telugu » Crime » Kovvuri Soujanyas Five Page Letter Raises Serious Questions Over Allegations Against Sadik
Kovvuri Soujanya Death Note : కాకినాడలో కొవ్వూరి సౌజన్య ఆత్మహత్య ఘటన సంచలనం రేపింది. సౌజన్య మరణ వాంగ్మూలం ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. ఆమె రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల లేఖలో సాదిక్‌పై సౌజన్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన మరణానికి ముందు రాసిన ఈ లేఖలో తనకు ఎదురైన పరిస్థితులు, కుటుంబ సమస్యలు, తనపై జరిగినట్లు ఆరోపించిన వేధింపులు, బెదిరింపులు, ఆస్తికి సంబంధించిన పూర్తి వ్యవహారాలను సౌజన్య వివరించింది.
ఆ లేఖను పరిశీలిస్తే.. చిన్నప్పటి నుంచే ఒకరి దగ్గర మాట పడకూడదు, ఎవరి దగ్గరా ఏదీ చెప్పించుకోకూడదని నాకు నేనే గీత గీసుకుని, బాగా చదువుకుని అన్ని రంగాల్లో ముందుండేలా స్వయంగా అన్నీ నేర్చుకునేదాన్ని. నా తండ్రిగారు ఎంతో మంచి పేరు, మర్యాదలు కలిగిన వ్యక్తి. చాలా కష్టజీవి, త్యాగానికి పెట్టింది పేరు. ఆయన నా ఆదర్శం, నాకు మార్గదర్శి. ఆయన పరువుకు నా వల్ల ఎలాంటి చెడ్డపేరు రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని… తన భర్తతో వ్యక్తిగత సమస్యలపై సాదిక్ మొదట తనకు అండగా ఉంటానంటూ దగ్గరయ్యాడని ఆమె ఆరోపించింది. తన వ్యక్తిగత విషయాలను తెలుసుకుని వాటిని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. తాను ఎదిరించిన ప్రతిసారీ దాడి చేసేవాడని, ఈ వేధింపులతోనే తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని తెలిపింది.
తన కుమారుడు రియోనే తనకు బలమని, బాబు కోసమే ఎన్నో సందర్భాల్లో చనిపోవాలనే ఆలోచనను మానుకున్నానని లేఖలో పేర్కొంది. తన కుమారుడు చదివే స్కూళ్లోనే సాదిక్ ట్రైనర్‌గా చేరి ఒత్తిడికి గురిచేశాడని, కుమారుడికి హాని చేస్తానని బెదిరించేవాడని ఆరోపించింది.
తన భర్తకు ప్రాణాంతక రసాయనం ఇచ్చి చంపేశాడని కూడా సౌజన్య లేఖలో ఆరోపించింది. ఆ రసాయనం విదేశాల నుంచి తెప్పించాడని ఆ తర్వాతే తెలిసిందని పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలన్నీ దర్యాప్తులో నిర్ధారించాల్సి ఉంది.
తన ఇంటి తాళాలు, బ్యాంకు భద్రపెట్టె తాళాలు, ఫోన్లు, ఆస్తి పత్రాలు, ముఖ్యమైన వస్తువులు సాదిక్ ఆధీనంలో ఉన్నాయని ఆమె ఆరోపించింది. తన ఆస్తిపై అతడి కన్ను ఉందని ఆలస్యంగా తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది.
తనను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడని, మాట వినకపోతే మరింత వేధిస్తానని బెదిరించాడని వాపోయింది. తనపై పలుమార్లు దాడులు చేయడమే కాకుండా ఉప్పాడ సముద్రతీరానికి తీసుకెళ్లి తనను సముద్రంలోకి తోసేశాడని, అనంతరం మళ్లీ వెనక్కి తీసుకొచ్చి బెదిరించాడని లేఖలో ఆరోపించింది.
పోలీసు శాఖలో పరిచయాలు ఉన్నాయని, ఫిర్యాదు చేస్తే తనపై తప్పుడు కేసులు పెట్టిస్తానని, తన కుమారుడిని చంపేస్తానంటూ బెదిరించేవాడని సౌజన్య పేర్కొంది. ఏఐతో తప్పుడు ఆధారాలు సృష్టిస్తానని కూడా బెదిరించాడని కూడా ఆమె లేఖలో ఆరోపించింది.
తన కుటుంబ సభ్యులతో పాటు తల్లిదండ్రులు, కుమారుడు కూడా ప్రమాదంలో ఉన్నారనే భయంతో తాను తీవ్ర ఒత్తిడికి గురయ్యానని లేఖలో పేర్కొంది. తన భర్త మరణానికి న్యాయం జరగాలని కోరుతూ, తన ఆస్తి తనకు ఇష్టమైన విధంగా వినియోగించాలని చివరి కోరికను కూడా వెల్లడించింది.
తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపింది. మహిళలు, ముఖ్యంగా పిల్లల తల్లులు అప్రమత్తంగా ఉండాలని లేఖలో సూచించింది. వ్యక్తిగత బలహీనతలను ఆసరాగా చేసుకుని జీవితాల్లోకి ప్రవేశించే వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరింది. సౌజన్య లేఖలో చేసిన ఆరోపణలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. ఆమె లేఖలోని ప్రతి అంశం కేసు దర్యాప్తులో ఎంతవరకు కీలకంగా మారుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Note : ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాని నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం అందించే జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి. సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.








