కడప జిల్లాలో ఉన్న భారతి సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ వద్ద టీడీపీ కార్యకర్తలు నాలుగు రోజులుగా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. మైనింగ్ ప్రాంతంలోకి వాహనాలు వెళ్లకుండా అడ్డుకోవడంతో కాప్టివ్ మైన్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. సున్నపురాయి సరఫరా ఆగిపోవడంతో సిమెంట్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఈ దౌర్జన్యాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, ఈ ఘటనలు చంద్రబాబు ఆదేశాల మేరకే జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పరిశ్రమను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని పలువురు పారిశ్రామికవేత్తలు విమర్శిస్తున్నారు.
ఈ పరిణామాల వల్ల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 15 వేల మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రభుత్వ పెద్దలు ఈ తరహా దాడులను ప్రోత్సహిస్తున్నారని పరిశ్రమ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక ప్రయోజనాలను రాజకీయ పగ కోసం పణంగా పెడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.








