జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు ముందు భారత జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తన ఆటతీరుపై స్పష్టత ఇచ్చారు. మ్యాచ్ పరిస్థితులను బట్టి తన బ్యాటింగ్ శైలి మారుతుందని, జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
తొలి ఓవర్లలోనే జట్టు 4 లేదా 5 వికెట్లు కోల్పోయిన క్లిష్ట సమయంలో, క్రీజులోకి రాగానే దూకుడుగా ఆడి వికెట్ పారేసుకోవడం బాధ్యతారాహిత్యమని తిలక్ వర్మ అభిప్రాయపడ్డారు. అటువంటి పరిస్థితుల్లో తాను దూకుడుగా బ్యాటింగ్ చేయలేనని, జట్టు మేనేజ్‌మెంట్ ఆశించే వ్యూహాలకు లోబడి ఓపికగా ఆడటం అవసరమని ఆయన వివరించారు.
గత రెండేళ్లుగా ఆసియా ఖండంలోనే ఎక్కువగా మ్యాచ్‌లు ఆడటం వల్ల యూకే పరిస్థితులకు అలవాటు పడటం కష్టమైందని, అందుకే అక్కడ ఓటములు ఎదురయ్యాయని ఆయన చెప్పారు. ఇంగ్లాండ్ బలమైన జట్టు అని, ఆ సిరీస్ నుంచి నేర్చుకున్న పాఠాలు తమకు ఉపయోగపడతాయని తెలిపారు.
జింబాబ్వేను తక్కువ అంచనా వేయకూడదని తిలక్ వర్మ హెచ్చరించారు. గతేడాది పర్యటన అనుభవాలు, ఐర్లాండ్-ఇంగ్లాండ్ సిరీస్‌ల నుంచి పొందిన అనుభవం రాబోయే జింబాబ్వే సిరీస్‌లో జట్టుకు కలిసి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.








