అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకప్పుడు ఆదరణ పొందిన ముక్కోణపు వన్డే సిరీస్ (Tri-Series) మళ్లీ తెరపైకి రానుంది. వన్డే ఫార్మాట్‌కు ఉన్న ఆసక్తిని పెంచేందుకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) కొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈసీబీ సీఈఓ రిచర్డ్ గౌల్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం, వచ్చే 12 నుంచి 18 నెలల్లో వన్డే ఫార్మాట్‌లో కీలక మార్పులు రాబోతున్నాయి.
చివరిసారిగా 2015లో ఆస్ట్రేలియా వేదికగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ జరిగింది. ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లు, టీ20 లీగ్‌ల హడావిడిలో ఈ ఫార్మాట్ కనుమరుగైంది. అయితే, అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నింపేందుకు భారత్, ఇంగ్లాండ్‌లతో పాటు మరో ప్రధాన జట్టును కలుపుకొని ముక్కోణపు సిరీస్ నిర్వహించేందుకు చర్చలు వేగవంతం చేశారు.
ద్వైపాక్షిక సిరీస్‌ల కంటే ముక్కోణపు సిరీస్‌లలో పాయింట్ల పట్టిక, ఫైనల్ బెర్త్ కోసం జరిగే పోటీ బ్రాడ్‌కాస్టర్లకు, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఈసీబీ భావిస్తోంది. ఐసీసీ మెగా టోర్నీలకు ముందు యువ ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి, సీనియర్లకు తగిన మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించడానికి ఈ సిరీస్‌లు ఉపయోగపడతాయని బోర్డు అంచనా వేస్తోంది.
మరోవైపు, టెస్టు క్రికెట్‌లోనూ ఇంగ్లాండ్ బోర్డు మార్పులు కోరుకుంటోంది. భారత్, ఆస్ట్రేలియాలతో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లు ఆడటమే అత్యున్నత స్థాయి పోటీ అని ఈసీబీ పేర్కొంది. భవిష్యత్తులో సౌతాఫ్రికాతో కూడా ఇదే తరహాలో సుదీర్ఘ సిరీస్‌లు నిర్వహించాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యోచిస్తోంది.







