జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సాయి సుదర్శన్, హర్షిత్ రానా వంటి కీలక ఆటగాళ్లు పదే పదే గాయాలతో జట్టుకు దూరమవుతున్నారు. ఈ పరిణామం 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మరియు అదే ఏడాది జరగాల్సిన వన్డే ప్రపంచకప్ ప్రణాళికలపై ప్రభావం చూపుతోంది. ఆటగాళ్లు గాయపడిన ప్రతిసారీ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీ - NCA) ఫిజియోలపై నిందలు వేయడం సరికాదని గవాస్కర్ స్పష్టం చేశారు.
ఆటగాళ్లు జిమ్ ఫిట్‌నెస్ కోసం కండలు పెంచడంపై చూపే శ్రద్ధ, మైదానంలో మ్యాచ్ ఆడేందుకు అవసరమైన ఫిట్‌నెస్‌పై చూపడం లేదని ఆయన విమర్శించారు. బయోమెకానిక్స్ పేరుతో నెట్స్‌లో బౌలర్లను పరిమిత బంతులు మాత్రమే వేయనివ్వడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరుగుతోందని ఆయన వివరించారు. ఐపీఎల్ వంటి టోర్నీల్లో విదేశీ ఫిజియోలు బౌలర్లకు 20 బంతుల పరిమితి విధిస్తుండగా, అసలు మ్యాచ్‌లో వారు కనీసం 24 బంతులు వేయాల్సి వస్తోంది.
ప్రాక్టీస్ సెషన్లలో తక్కువ బంతులు వేసి, మ్యాచ్‌లో ఎక్కువ బంతులు వేయడం వల్ల ఆటగాళ్లు స్నాయువు (హామ్ స్ట్రింగ్) గాయాలకు గురవుతున్నారని గవాస్కర్ విశ్లేషించారు. మైదానంలో వంద శాతం కష్టపడాలంటే ప్రాక్టీస్ కూడా అదే స్థాయిలో ఉండాలని ఆయన సూచించారు. ఈ గాయాల బెడదపై భారత క్రికెట్ బోర్డు లోతైన సమీక్ష జరపాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన హెచ్చరించారు.








