మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల విలేజ్‌లో విష్ణువర్ధన్ రెడ్డి మిల్క్ షాపు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ తెల్లవారుజామున పాల వ్యాన్ వచ్చి షాపు ముందు పాల ప్యాకెట్ల ట్రేలను ఉంచి వెళ్తుంది. అయితే, గత కొద్ది రోజులుగా ట్రేలలో పాల ప్యాకెట్ల సంఖ్యలో తేడాలు వస్తుండటంతో విష్ణువర్ధన్ రెడ్డికి అనుమానం కలిగింది.
ఈ నేపథ్యంలో, తన షాపులోని సీసీటీవీ ఫుటేజీని విష్ణువర్ధన్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు. గత నెలలో 10 సార్లకు పైగా తెల్లవారుజామున ఒక యువకుడు వచ్చి పాల ట్రేలను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో ఆధారంగా అసలు నిజం బయటపడింది.
దుకాణంలో వరుసగా జరుగుతున్న ఈ చోరీలపై విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.








