జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పర్యవేక్షించే జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC) నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీజీఎల్ (CGL - కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్) పరీక్షలతో పాటు పలు రిక్రూట్‌మెంట్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన దాదాపు 2 వేల మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థులు మంగళవారం మీడియా ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమను ఉద్యోగం నుంచి తొలగించే బదులు కాల్చి చంపేయండి అంటూ లాలన్ పాండే అనే అభ్యర్థి కన్నీటి పర్యంతమయ్యాడు. తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమని, తమకు నార్కో పరీక్షలు నిర్వహించాలని అతను కోరాడు.

విజిలెన్స్ శాఖలో పనిచేస్తున్న సందీప్ యాదవ్ అనే అభ్యర్థి తన పరిస్థితిని వివరిస్తూ ఆవేదన చెందాడు. తన గుర్తింపు కార్డును పరిశీలించిన సెక్యూరిటీ గార్డు, తనను కార్యాలయంలోకి అనుమతించలేదని అతను చెప్పాడు. రెండు నెలల క్రితమే తనకు పెళ్లయిందని, ఉద్యోగం చూసే తనకు పిల్లను ఇచ్చారని, ఇప్పుడు ఉద్యోగం పోవడంతో భార్యతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అతను వాపోయాడు.

సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న రఘువేంద్ర అనే అభ్యర్థి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్వయంగా నియామక పత్రాలు ఇచ్చి, ఇప్పుడు ఆయనే ఉద్యోగాలు లాగేసుకున్నారని ఆరోపించాడు. సుప్రీంకోర్టు తీర్పును చూశాకే పాత ఉద్యోగానికి రాజీనామా చేశానని, ఇప్పుడు కొత్త ఉద్యోగాలకు పోటీ పడే వయసు కూడా దాటిపోయిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

కోర్టు తీర్పుల తర్వాతే తాము ఉద్యోగాల్లో చేరామని బాధితులు స్పష్టం చేశారు. నిరసనకారుల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమకు తీవ్ర అన్యాయం చేసిందని వారు ఆరోపించారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, ఈ నిర్ణయంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అభ్యర్థులు ప్రకటించారు.