గత మూడు దశాబ్దాలుగా జపాన్ ఆర్థిక వ్యవస్థ విచిత్రమైన స్థితిలో ఉంది. భారీగా అప్పులు చేస్తూ, పెద్ద మొత్తంలో కరెన్సీని ముద్రించినా ద్రవ్యోల్బణం పెరగలేదు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారి, దాగి ఉన్న సమస్యలన్నీ ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా జపాన్ కరెన్సీ 'యెన్' విలువ డాలర్‌తో పోలిస్తే 163కి పడిపోయి, 40 ఏళ్ల కనిష్ఠ స్థాయిని తాకింది.

1990లలో ప్రాపర్టీ, స్టాక్ మార్కెట్ ధరలు కుప్పకూలడంతో జపాన్ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. దీని నుంచి బయటపడటానికి జపాన్ సెంట్రల్ బ్యాంక్ వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసి, మార్కెట్లోకి డబ్బును విడుదల చేసింది. కానీ, ఆశించిన వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం రాకపోగా, ప్రభుత్వ రుణం దేశ జీడీపీలో 200 శాతానికి పైగా పెరిగిపోయింది. 2022 ప్రారంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం జపాన్‌ను కూడా తాకడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ప్రస్తుతం జపాన్ సెంట్రల్ బ్యాంక్ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, రెండోది బాండ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడం. ఇతర దేశాలు వడ్డీ రేట్లను పెంచినా, జపాన్ మాత్రం 2024 మార్చి వరకు వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. దీనివల్ల ఇన్వెస్టర్లు యెన్ కంటే డాలర్లు, యూరోల వైపు మొగ్గు చూపారు. కరెన్సీని కాపాడుకోవడానికి ప్రభుత్వం 73 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు.

వడ్డీ రేట్లు పెంచితే ప్రభుత్వ బాండ్ల విలువ పెరిగి, అప్పులపై వడ్డీ చెల్లించడం జపాన్ ప్రభుత్వానికి భారమవుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచకపోతే ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. అయితే, గత దశాబ్దాలుగా విదేశాల్లో కూడబెట్టిన ట్రిలియన్ల డాలర్ల విలువైన ఆస్తులు జపాన్‌కు ప్రస్తుతానికి రక్షణగా ఉన్నాయి. అత్యవసరమైతే వీటిని అమ్మి అప్పులు తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనే శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.