ఉత్తర్ ప్రదేశ్ ఫతేపూర్ జిల్లాకు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె యశస్వీ రాజే సింగ్ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో లైంగిక వేధింపులకు గురైనట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరోపించారు. జూలై 24న తన సోదరితో కలిసి విద్యార్థి నిరసనల్లో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె పేర్కొన్నారు.
జనాల గుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు బారికేడ్ కింద పడిపోయి తొక్కిసలాట జరిగిందని, ఆ సమయంలో తన వెనుక ఉన్న వ్యక్తి లైంగికంగా వేధించాడని ఆమె వివరించారు. తనను అసభ్యంగా తాకడమే కాకుండా, బలవంతంగా తన చేతిని కాళ్ల మధ్య పెట్టాడని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే తాను ఆ వ్యక్తిని మూడుసార్లు చెంపదెబ్బ కొట్టినట్లు ఆమె వెల్లడించారు.
అయితే, అక్కడ తనకు మద్దతు లభిస్తుందని ఆశించినా, నిరసనలో ఉన్నవారు తనపైనే కోపం ప్రదర్శించారని ఆమె ఆరోపించారు. ఒక వాలంటీర్ తనపై అరవగా, మరొకరు ఇలాంటివి జరుగుతుంటాయని పట్టించుకోవద్దని చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్, తనకు దీని గురించి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. తన కుమార్తెతో పాటు ఆమె తల్లి కూడా ఉన్నారని, ఘటన గురించి ఆమెకు తెలిసి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.







