టాలీవుడ్‌లో డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ఆయన ఉప ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించగా, ఫిల్మ్ ఫెడరేషన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఫెడరేషన్ నిబంధనలను పట్టించుకోకుండా జానీ మాస్టర్ ముందుకు వెళ్తున్నారని ఇండస్ట్రీలో విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ వివాదం నేపథ్యంలో జానీ మాస్టర్‌పై శాశ్వత నిషేధం విధించాలా లేదా ఇతర చర్యలు తీసుకోవాలా అనే అంశంపై ఫిల్మ్ ఫెడరేషన్ అంతర్గతంగా చర్చిస్తోంది. గతంలో అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పది మంది సభ్యులు రాజీనామా చేయడంతో ఈ సమస్య మొదలైంది. అప్పట్లో ఫెడరేషన్ జోక్యంతో సమస్య పరిష్కారమైనట్లు ప్రకటించినప్పటికీ, మళ్లీ అదే తరహా ఆరోపణలు రావడం గమనార్హం.

ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయాలు తమను ఇబ్బంది పెడుతున్నాయని జానీ మాస్టర్ నిర్మాతల వద్ద వినతిపత్రం ఇవ్వడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. అసోసియేషన్‌లో తరచూ జరుగుతున్న గొడవలకు జానీ మాస్టరే కారణమని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఫెడరేషన్‌ను లెక్కచేయని తీరుపై ఆయనపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.