చెన్నైకి చెందిన 'బీ పాజిటివ్ 24 ఇన్నోవేషన్ డిజైన్' అనే సృజనాత్మక సంస్థ ఈ ప్రాజెక్టును రూపొందించింది. రాకెట్ ప్రయోగం, రైలు శబ్దం, పక్షుల కిలకిలరావాలు, పాఠశాల గంటలు, దేవాలయ గంటలు, సంగీత వాయిద్యాలు, ప్రకృతి శబ్దాలు వంటి 50కి పైగా శబ్దాలను సేకరించి జాతీయ గీతం బాణీలో ఒకే పాటగా మలిచారు.
ఈ ప్రయోగానికి 100 రోజులకు పైగా సమయం పట్టిందని, 100కు పైగా శబ్దాలను రికార్డ్ చేసి 35 సార్లు మార్పులు చేశామని 'బీ పాజిటివ్ 24 ఇన్నోవేషన్ డిజైన్' వ్యవస్థాపకుడు అభిషేక్ డి షా తెలిపారు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
భారతదేశం తమ ఇల్లు అని, ఈ సంగీత నివాళి ద్వారా ఆవిష్కరణలతో కూడిన ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నామని 'ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్' సీఈఓ సిద్ధార్థ్ రెడ్డి ఇందుకూరి చెప్పారు. ఆలోచన పరంగా సరళంగా ఉంటూనే, భావోద్వేగ పరంగా శక్తివంతమైన పనిని చేయాలని తాము ప్రయత్నించామన్నారు.
ఈ ప్రచార చిత్రం ఆగష్టు 12, 2026 నుంచి 'ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్' యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులోకి వస్తుంది. దేశవ్యాప్తంగా సేకరించిన శబ్దాలతో రూపొందించిన ఈ ప్రత్యేక వీడియోను ప్రజలు ఆన్‌లైన్‌లో చూడవచ్చు.








