సంగారెడ్డిలోని తన నివాసంలో నిర్వహించిన సత్యనారాయణ వ్రతం, కుమారుడు భరత్ సాయి రెడ్డి- కోడలు పాలక్ పటేల్ వివాహ వేడుకకు జగ్గారెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించడంతో హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను హరీశ్‌రావు ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు) హోదాలో ఉన్న జగ్గారెడ్డి, బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్‌రావు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు.

ఈ కలయికపై జగ్గారెడ్డి స్పందిస్తూ, ఇది పూర్తిగా కుటుంబపరమైన కార్యక్రమమని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. 2004లో హరీశ్‌రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఛాంబర్‌లో కలిసి భోజనం చేసేవారమని, ఆ తర్వాత తాను కాంగ్రెస్‌లో చేరాక ఇప్పటివరకు కలవలేదని గుర్తుచేశారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం జరిగిందని ఆయన వివరించారు.

రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరని జగ్గారెడ్డి పేర్కొన్నారు. హరీశ్‌రావు బీఆర్ఎస్‌లో కీలక నేత అని, తాను కాంగ్రెస్‌లో ఒక స్థాయి నాయకుడినని చెబుతూ, వేర్వేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన వ్యక్తిగత విభేదాలు ఉన్నట్లు భావించకూడదని ఆయన అన్నారు. గతంలో హరీశ్‌రావు పదేళ్లపాటు మంత్రిగా ఉన్న సమయంలో కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనను కలవలేదని, అనేక కుటుంబ వేడుకలకు ఆహ్వానించలేకపోయానని తెలిపారు.

తన కుమార్తె వివాహానికి హరీశ్‌రావును పిలవలేకపోయానని, అయితే ఈసారి కుటుంబ కార్యక్రమాన్ని ఆయన మిస్ కావొద్దనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆహ్వానించానని జగ్గారెడ్డి చెప్పారు. రాజకీయాలకు, ఈ భేటీకి ఎలాంటి సంబంధం లేదని, దీని వెనుక మరే ఇతర మతలబు లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.