ఢిల్లీలో జరిగిన క్రియేటివ్ కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన సందీప్ దీక్షిత్‌ను ఆలింగనం చేసుకోగా, సందీప్ దీక్షిత్ 'నన్ను మీరు మెలోనీ అనుకోలేదు కదా' అని వ్యాఖ్యానించారు. దీనికి రాహుల్ గాంధీ 'నేను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు' అని సమాధానమివ్వడంతో అక్కడ నవ్వులు వినిపించాయి.
ఈ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందిస్తూ, ఇటలీతో భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఏ విషయాన్నైనా గౌరవంగా చర్చించాలని, దేశాల మధ్య పరస్పర గౌరవం, అవగాహన ఎంతో ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. దేశాన్ని నడిపించడానికి పరిణతి చెందిన నాయకత్వం అవసరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. ప్రధానిని అవమానించడం ద్వారా రాహుల్ గాంధీ దేశ ప్రజలను కూడా అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ వివాదంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియాలో స్పందించారు. గతంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విదేశీ అధినేతలను ఆలింగనం చేసుకున్న ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు.








