తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వడ్డించే సాంబార్‌లో అరుముగం అనే వ్యక్తి పేడ పొడిని కలిపాడు. ప్రభుత్వం విద్యార్థులకు ఉదయం పూట ఉచితంగా ఆహారం అందించే పథకం (ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్) ద్వారా ఈ వంటకాలు సిద్ధం చేస్తారు. ఆగస్టు 29, 2026న జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అరుముగం భార్య గతంలో అదే పాఠశాలలో వంట మనిషిగా పనిచేసేది. అయితే వంట నాణ్యత పాటించకపోవడం, శుభ్రతను నిర్లక్ష్యం చేసి పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోందనే కారణంతో ఆమెను యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ తొలగింపుపై అరుముగం కక్ష పెంచుకున్నాడు.

పాఠశాల నిబంధనల ప్రకారం, పిల్లలకు వడ్డించే ముందు ఉపాధ్యాయులు వంటకాలను రుచి చూసి పరీక్షించాలి. ఆ రోజు సాంబార్ చేదుగా ఉండటంతో టీచర్లకు అనుమానం వచ్చింది. మొదట పసుపు ఎక్కువై ఉంటుందని వారు భావించారు.

అయితే, సాంబార్ పాత్ర దగ్గర పేడ పొడి పడి ఉండటాన్ని గమనించిన సిబ్బందికి అసలు విషయం అర్థమైంది. దీంతో వారు నిందితుడిని నిలదీయగా, అరుముగం తన తప్పును ఒప్పుకున్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.