తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026-ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ నిర్వహణలో భాగంగా ప్రజాభవన్‌లో తక్షణమే ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు మహాత్మా ఫూలే ప్రజాభవన్‌లో ఆయన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు.
సమ్మిట్ కోసం అతిథులకు పంపే ఆహ్వాన పత్రాల ప్రక్రియను వేగవంతం చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ఈ వార్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ అధికారికి అప్పగించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పటిష్టం చేయాలని ఆయన ఆదేశించారు. సమ్మిట్ పనుల పురోగతిని ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టం చేశారు.
సమ్మిట్ కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలలో అవసరమైన నిపుణులను, కీలక అధికారులను తీసుకోవాలని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రతి కమిటీకి కేటాయించిన బాధ్యతలను నిర్ణీత సమయానికి (టైమ్‌లైన్) పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. గతంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల ప్రస్తుత పురోగతిని విశ్లేషించేందుకు ప్రత్యేక కమిటీకి బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
డిసెంబర్‌లో జరగనున్న ఈ సమ్మిట్ కోసం దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తృతంగా రోడ్ షోలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోడ్ షోల ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమ్మిట్ పనులు వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.








