రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పాలన, ఎన్నికల హామీల అమలుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఈ సర్వేలో తేలింది. రేవంత్ రెడ్డి పాలన బాగాలేదని, హామీలు అమలు కాలేదని 74.64 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. కేవలం 19.1 శాతం మంది మాత్రమే ప్రస్తుత ప్రభుత్వ పనితీరు బాగుందని పేర్కొన్నారు.

రాజకీయ విధానాల విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు సరిగా లేదని 71.33 శాతం మంది ప్రజలు స్పష్టం చేశారు. అంతర్గత విభేదాలు, మంత్రులు మరియు ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ప్రజలను విసిగించాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుకోవడం సరైన పద్ధతి కాదని 92.87 శాతం మంది ప్రజలు కుండబద్దలు కొట్టారు.

గత బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పాలనతో ప్రస్తుత కాంగ్రెస్ పాలనను పోల్చి చూడగా, 72.82 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలనే బాగుందని జై కొట్టారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ 76 శాతం మంది రేవంత్ పాలన బాగోలేదని, 84.4 శాతం మంది కేసీఆర్ నివాసంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక్కడ సర్వేలో పాల్గొన్న వారిలో 74.82 శాతం మంది హామీల అమలు జరగలేదని చెప్పగా, 73.01 శాతం మంది గత కేసీఆర్ పాలనే మెరుగని అభిప్రాయపడ్డారు. మంత్రుల నియోజకవర్గాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గం పాలేరులో కూడా కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. ఈ రెండు నియోజకవర్గాల్లో మెజారిటీ ప్రజలు రేవంత్ రెడ్డి పాలన కంటే గత పాలనే బాగుందని స్పష్టం చేశారు. కేసీఆర్ నివాసంపై జరిగిన దాడిని, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఈ ప్రాంతాల ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.