మంగళవారం ఇంద్రవెల్లి మండలంలో పర్యటిస్తున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు సాయినగర్‌లో ఇద్దరు చిన్నారులు బడికి వెళ్లకుండా తండ్రి వృత్తి పనుల్లో సహాయపడుతూ కనిపించారు. కమరే మల్లేష్ పవార్ కుటుంబానికి చెందిన నలుగురు పిల్లల్లో, ఇద్దరు మాత్రమే పాఠశాలకు వెళ్తున్నారని కలెక్టర్ గుర్తించారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన, ఆ చిన్నారులను పాఠశాలలో చేర్పించాలని జిల్లా సంక్షేమ అధికారి మిల్కాను ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ మరియు ఐసీడీఎస్ (ICDS) అధికారులు ఆ కుటుంబాన్ని కలిసి విద్య ఆవశ్యకతను తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం సునీతను ఇంద్రవెల్లి జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS)లో 6వ తరగతిలో, సునీల్‌ను ఎంపీపీఎస్ (MPPS) ఇంద్రవెల్లిలో 5వ తరగతిలో చేర్పించారు.

జిల్లాలో బడి బయట ఉన్న పిల్లలు లేదా బాల కార్మికులు ఉండకూడదనే లక్ష్యంతో యంత్రాంగం పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు ఉందని, తల్లిదండ్రులు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపాలని ఆయన సూచించారు. ఎవరైనా బడి బయట ఉన్న పిల్లలను లేదా బాల కార్మికులను గుర్తిస్తే, వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు.