మేఘాలయ హనీమూన్ హత్య కేసు బాధితుడు రాజా రఘువంశీకి చెందిన ఇండోర్‌లోని 'రాజా భోజ్ ధాబా'లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాబా నిర్వాహకులు ఎటువంటి అనుమతులు లేకుండానే వినియోగదారులకు మద్యం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

దీంతో దాబా మేనేజర్ సచిన్ రఘువంశీ, ఆపరేటర్ విపిన్ రఘువంశీతో పాటు మొత్తం ఆరుగురిపై ఎక్సైజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం దాబాలో పనిచేసే సిబ్బంది వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాల్సి ఉండగా, ఆ నిబంధనను కూడా వారు పాటించలేదని పోలీసులు వెల్లడించారు.

నిందితులు సచిన్, విపిన్‌లు రాజా రఘువంశీకి స్వయానా సోదరులని పోలీసులు ధృవీకరించారు. రాజా రఘువంశీ పేరు మీదనే వారు ఈ దాబాను నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ కేసులో అరెస్టు చేసిన ఇద్దరు సోదరులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరినీ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.