ఇంఫాల్: డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ట్రావ్ ఎఫ్‌సీ విజయం సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్–డి చివరి మ్యాచ్‌లో ఇండియన్ నేవీ ఎఫ్‌టీపై 2–1 తేడాతో గెలిచింది. ట్రావ్ తరఫున అఫ్రిది బుయామయుమ్ రెండు గోల్స్ చేశాడు. గోల్‌కీపర్ తాజుద్దీన్ అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి దాడులను సమర్థంగా అడ్డుకున్నాడు. మ్యాచ్‌లో ఇండియన్ నేవీ ఎక్కువసేపు ఆధిపత్యం ప్రదర్శించింది. ఏకంగా 26 సార్లు గోల్ కోసం ప్రయత్నించినా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది.
మరోవైపు లభించిన అవకాశాలను ట్రావ్ గోల్స్‌గా మలిచింది. 16వ నిమిషంలో బుయామయుమ్ గోల్ చేసి ట్రావ్‌కు 1–0 ఆధిక్యం అందించాడు. రెండో అర్ధభాగం ప్రారంభమైన వెంటనే 46వ నిమిషంలో ఖుల్లక్‌పామ్ జహీర్ ఖాన్ గోల్‌తో ఇండియన్ నేవీ స్కోరును 1–1తో సమం చేసింది.
అయితే 60వ నిమిషంలో బుయామయుమ్ అద్భుతమైన గోల్‌తో మరోసారి ట్రావ్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఇండియన్ నేవీ తీవ్రంగా ప్రయత్నించినా ట్రావ్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. ఈ విజయంతో ట్రావ్ మూడు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో గ్రూప్–డిలో రెండో స్థానంలో నిలిచింది.








