హైదరాబాద్ నగరంలో వర్షం పడితే చాలు, పది నిమిషాల ప్రయాణానికి గంటన్నర సమయం పడుతోంది. రోడ్లు నదులను తలపించడంతో వాహనాలు ఆగుతూ, కదులుతూ సాగుతున్నాయి. ఈ ట్రాఫిక్ వల్ల వాహనాల ఇంజిన్‌పై తీవ్ర ప్రభావం పడుతుండగా, మరోవైపు ఓలా, ర్యాపిడో, ఉబర్ వంటి యాప్‌లు ధరలను మూడు రెట్లు పెంచి ప్రయాణికులపై భారం మోపుతున్నాయి. బంజారాహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు ఈ ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ట్రాఫిక్‌లో వాహనాన్ని నెమ్మదిగా నడపడం, క్షణానికో గేరు మార్చడం వల్ల ఇంజిన్ ప్లగ్ పాయింట్‌లోకి నీరు చేరి వాహనాలు రోడ్లపైనే ఆగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో కిక్ కొట్టడం వల్ల పెట్రోల్ ఓవర్ ఫ్లో అయి ప్లగ్ పాడవుతుందని మెకానిక్‌లు హెచ్చరిస్తున్నారు. కీ పాయింట్ వద్ద నీరు చేరినా బండి స్టార్ట్ కాదు. ఈ సమస్యలను అధిగమించడానికి ప్లగ్ క్యాప్ తీసి తుడవడం, కీ పాయింట్ వద్ద గాలి ఊదడం వంటివి చేయాలని వారు సూచిస్తున్నారు. క్లచ్ వైర్ నాణ్యతను పరిశీలించడం, రెండు నెలలకోసారి ఇంజిన్ ఆయిల్ మార్చడం వంటివి తప్పనిసరి.
వర్షాకాలంలో టైర్ల గ్రిప్ కోల్పోవడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. కార్ల టైర్లలో గాలిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని, 40 వేల కిలోమీటర్లు దాటిన కార్లకు కొత్త టైర్లు అమర్చాలని మెకానిక్‌లు చెబుతున్నారు. ప్రతి 5 వేల కిలోమీటర్లకు ఒకసారి వీల్ బ్యాలెన్స్ చెక్ చేయించుకోవడం వల్ల టైర్ బ్లాస్ట్ వంటి ప్రమాదాలను నివారించవచ్చు. రాజేంద్రనగర్ హైవేపై ఇటీవల కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగిన ఘటన నేపథ్యంలో, వాహనదారులు తమ వాహనాల నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
నగరంలో జనాభాతో సమానంగా వాహనాల సంఖ్య పెరుగుతోంది. రవాణా శాఖ రికార్డుల ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్‌లో 70 శాతానికి పైగా ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నప్పటికీ, వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గడం లేదు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.






