నెదర్లాండ్స్‌కు చెందిన 36 ఏళ్ల మహిళ తన ప్రియుడితో కలిసి మార్చి 5 నుండి 23 వరకు భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో వారు బస చేశారు. ఆ సమయంలో అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బీహార్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆదిత్య ఆనంద్, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
మార్చి 17న ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు అర్ధనగ్నంగా ఆమె గదిలోకి ప్రవేశించాడు. ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు, తన ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలా చేస్తున్నానని చెప్పాడు. అదే సమయంలో ఆమె ప్రియుడు గదికి తిరిగి రావడంతో, నిందితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
తమ దేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని తన ప్రియుడికి చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం డచ్ రాయబార కార్యాలయానికి సమాచారం అందించిన ఆమె, జూలై 22న హైదరాబాద్‌కు వచ్చి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్‌ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్లు 74, 75, 78, 79 కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం నిందితుడు ఆదిత్య ఆనంద్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు గచ్చిబౌలి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.






