హైదరాబాద్ నగరంలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారి వల్ల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఒకే రోజు జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలు నార్సింగి, మాదాపూర్ మరియు బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదయ్యాయి.
నార్సింగి పరిధిలోని హైదర్ షాకోట్ వద్ద శంషాబాద్‌కు చెందిన బాబు గౌడ్‌కు చెందిన మహీంద్రా XUV కారు రాంగ్ రూట్‌లో వచ్చి భారత ఆర్మీ జవాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జవాన్ అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్న ఐదుగురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు మాదాపూర్ ఆర్టీవో ఆఫీస్ సమీపంలో థార్ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న శివకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
బాలాపూర్ పరిధిలో జరిగిన మూడో ప్రమాదంలో ఎర్టిగా కారు అతివేగంతో ముందున్న వాహనాలను ఢీకొట్టి పల్టీ కొట్టింది. కారులో బీరు సీసాలను గుర్తించిన పోలీసులు, డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల దేశవ్యాప్తంగా రోజుకు సగటున 11 నుంచి 15 మంది మరణిస్తున్నారు.
తరచూ జరుగుతున్న ఈ ప్రమాదాల నేపథ్యంలో, నిబంధనలను కఠినతరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. మొదటిసారి మద్యం తాగి వాహనం నడిపితే డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలలు రద్దు చేయాలని, రెండోసారి దొరికితే శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మద్యం మత్తులో వాహనం నడిపి ఎదుటివారి మరణానికి కారణమైతే, నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో పాటు హత్యతో సమానమైన సెక్షన్లు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.








