హైదరాబాద్‌లో కొత్తగా రానున్న యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్ యూనివర్సిటీ (YISU) కోసం, దక్షిణ కొరియాలోని ప్రముఖ క్రీడా శిక్షణ సంస్థ కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ (KNSU)తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎక్స్ (X) ఖాతా ద్వారా వెల్లడించారు.
ఇటీవల దక్షిణ కొరియాలో పర్యటించిన సమయంలో, KNSU అధ్యక్షుడు మూన్ వోన్-జేతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగానే హైదరాబాద్‌లో ప్రతిపాదిత క్రీడా యూనివర్సిటీ ఏర్పాటుకు KNSU సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది.
ఈ ఒప్పందం కేవలం కాగితాలకే పరిమితం కాదని, తెలంగాణ క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ, క్రీడా విజ్ఞానం అందించే వారధిగా పనిచేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా గెలుచుకున్న 32 పతకాల్లో, 16 పతకాలను KNSUలో శిక్షణ పొందిన క్రీడాకారులే సాధించారు. అటువంటి అద్భుతమైన క్రీడా సంస్కృతిని తెలంగాణలో కూడా తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
2036 ఒలింపిక్స్‌కు భారత్ సిద్ధమవుతున్న తరుణంలో, తెలంగాణ కేవలం క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా, దేశానికి గర్వకారణంగా నిలిచే ఒలింపిక్ క్రీడాకారులను తయారు చేయాలని భావిస్తోంది. ఈ కీలక ప్రక్రియను ముందుకు నడిపిస్తున్న క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా మంత్రిత్వ శాఖ మరియు YISU అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.
రాబోయే రోజుల్లో ఈ ఒప్పందం ద్వారా క్రీడా విద్యలో ఉత్తమ పద్ధతులను అమలు చేస్తూ, రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.








