బాలానగర్ కేంద్రంగా గంజాయి దందా చేస్తున్న బొల్లా కిరణ్ ముఠాపై ఈగల్ ఫోర్స్ గురువారం దాడులు చేసింది. ఈ సమయంలో నిందితులు పోలీసులపై కుక్కలను ఉసిగొల్పి, స్క్రూడ్రైవర్లతో దాడికి ప్రయత్నించారు. తప్పించుకునే క్రమంలో బిల్డింగ్ పై నుంచి దూకిన ప్రధాన నిందితుడు బొల్లా కిరణ్ రెండు కాళ్లు విరగడంతో, పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్పించి మిగిలిన వారిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

ఈ దాడుల్లో గంజాయి ముఠాతో పోలీసులకు ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. నిందితులు గంజాయి నిల్వలు ఉంచిన ఇంట్లోనే పార్టీలు చేసుకున్న ఒక ఎస్సై, మరికొందరు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నారు. నిందితుల వద్ద దొరికిన పోలీస్ మ్యాన్ ప్యాక్ ఎవరిదనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

బొల్లా కిరణ్ ముఠా ఒడిశా నుంచి ప్రతిరోజూ 31 మంది ద్వారా గంజాయిని తెప్పించుకుంటోందని దర్యాప్తులో తేలింది. యువతులను ట్రాప్ చేసి వారి పేర్లతో సిమ్ కార్డులు తీసుకుని, డెడ్ డ్రాప్ పద్ధతిలో రోజుకు 25 ఆర్డర్లు సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాకు గంజాయి కొంటున్న విద్యార్థులు, వ్యాపారవేత్తల కాల్ లిస్టును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు కిరణ్ మహిళలను చిత్రహింసలకు గురిచేస్తూ, వారి ఖాతాల ద్వారా గంజాయి డబ్బులు లావాదేవీలు జరిపినట్లు ఆధారాలు లభించాయి. ప్రస్తుతం ఈ ముఠాతో సంబంధాలున్న మరో ఐదుగురు కానిస్టేబుళ్ల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది.