హైదరాబాద్‌కు చెందిన త్రిశక్తి హోమ్స్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ప్లాట్ కొనుగోలుదారు వి. ప్రవీణ్ కృష్ణ మరియు మంజుల ప్రవీణ్ కృష్ణలకు రూ. 42,20,479 తిరిగి చెల్లించాలని TG-RERA ఆదేశించింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అమ్మకాలను పర్యవేక్షించి, కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వ సంస్థే ఈ TG-RERA.

ఈ ప్రాజెక్టుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మరియు రెరా ఆమోదాలు ఉన్నాయని కంపెనీ నమ్మబలికింది. అంతేకాకుండా, సినీ నటుడు విక్టరీ వెంకటేష్ కుటుంబ సభ్యులు కూడా ఇందులో ప్లాట్లు కొన్నారని చెప్పి, ఫిర్యాదుదారులను పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించినట్లు వారు పేర్కొన్నారు.

అయితే, ఈ సంస్థ చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ లేకుండానే 'సాయి బాలాజీ వెంచర్' అనే ప్రాజెక్టులో ప్లాట్ల మార్కెటింగ్ మరియు విక్రయాలు జరిపింది. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం, 2016 ప్రకారం, ఏ ప్రాజెక్టునైనా విక్రయించే ముందు ప్రభుత్వం వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు గాను, సంస్థపై చర్యలు తీసుకోవాలని రెరా నిర్ణయించింది.

ఈ చెల్లింపులపై జూన్ 7, 2022 నుండి వడ్డీని కూడా లెక్కించాలని రెరా ఆదేశించింది. ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్ (బ్యాంకులు ఇచ్చే రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేటు) 8.70 శాతానికి అదనంగా 2 శాతం కలిపి, మొత్తం 10.70 శాతం వడ్డీని చెల్లించాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులు అందిన 60 రోజులలోపు బాధితులకు డబ్బులు చెల్లించాలని కంపెనీకి సూచించింది.

మరోవైపు, రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా తగిన అనుమతులు లేకుండా వ్యవహరించినందుకు, సదరు సంస్థపై జరిమానా విధించాలని రెరా కార్యదర్శిని ఆదేశించారు. చట్టంలోని సెక్షన్ 62 ప్రకారం ఈ జరిమానా విధింపు ప్రక్రియ కొనసాగుతుంది.