హర్మూజ్ జలసంధి పూర్తిగా అమెరికా నియంత్రణలోనే ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో వెల్లడిస్తూ, అమెరికా నేవీ చేపట్టిన దిగ్బంధాన్ని 'ఉక్కు గోడ'గా అభివర్ణించారు. ఇరాన్ నిరంతరం అబద్ధాలు ఆడుతోందని ఆరోపించిన ట్రంప్, ఆ దేశం దుందుడుకు చర్యలకు పాల్పడితే కఠినంగా స్పందిస్తామని హెచ్చరించారు.

ఇరాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ట్రంప్ విమర్శించారు. ఆ దేశంలో ద్రవ్యోల్బణం 300 శాతానికి పెరిగిందని, సైనికులకు జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ బలహీనపడిందని, ఆ దేశ నాయకత్వం ప్రమాదకర స్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ కేవలం మాటలకే పరిమితమైందని, చేతల్లో ఏమీ లేదని ఆయన విమర్శించారు.

మరోవైపు, హర్మూజ్ జలసంధిలో ఒమన్ వద్ద పనామా జెండా కలిగిన 'వేలా నోవా' కార్గో నౌకపై అమెరికా నేవీ హెలికాప్టర్ రెండు హెల్‌ఫైర్ క్షిపణులను ప్రయోగించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పనామా కాలువలో నౌకల రద్దీ పెరిగిందని, ఒక్కో నౌక నుంచి 4 మిలియన్ల డాలర్ల రుసుము వసూలు చేస్తున్నారని సమాచారం.

ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ ప్రతినిధి స్పందిస్తూ, హర్మూజ్ జలసంధిలో ప్రస్తుత పరిస్థితులకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఆరోపించారు. అయితే, రవాణా భద్రత కోసం ఇరాన్ మరియు ఒమన్ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.