హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయమైన కలెక్టరేట్‌ను పార్టీ కార్యాలయంగా మార్చేశారని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు.
ఈ వేడుకలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యాలయంలో ప్రజాప్రతినిధుల జన్మదిన వేడుకలు జరపడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వేడుకలకు సంబంధించిన సమాచారాన్ని మొదట హనుమకొండ ఐ అండ్ పీఆర్ (I&PR) అధికారిక గ్రూప్‌లో పోస్ట్ చేశారు. అయితే, ఇది వివాదాస్పదంగా మారడంతో కొద్దిసేపటికే ఆ పోస్ట్‌ను తొలగించారు.
గతంలో కూడా నాయిని రాజేందర్ రెడ్డి, దేవన్ విష్ణురెడ్డి రోడ్డును ఆక్రమించి పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు సమాచారం. ఇప్పుడు ఏకంగా కలెక్టరేట్‌ను వేదికగా మార్చుకోవడంపై చర్చ జరుగుతోంది.








