రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీ నెల్లూరులో నిర్వహించిన సమావేశంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చామని, హంద్రీ-నీవా ప్రాజెక్టుపై తగినంత దృష్టి సారించలేదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం హంద్రీ-నీవా ప్రాజెక్టు అభివృద్ధి, లైనింగ్ పనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన వివరించారు.
అయితే, ఈ వ్యాఖ్యలను టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హంద్రీ-నీవా ప్రాజెక్టులో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుండగా, ఇప్పుడు ఆ పార్టీ నేతే ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదని ఒప్పుకున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. విశ్వేశ్వర్ రెడ్డికి ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉందని, ఆయన అబద్ధాలు చెప్పరని పేర్కొంటూ టీడీపీ నేతలు ఆయన వ్యాఖ్యలను పదేపదే ప్రస్తావిస్తున్నారు.
ఈ పరిణామాలతో సొంత పార్టీలోనే విశ్వేశ్వర్ రెడ్డిని నాయకులు ప్రశ్నిస్తుండగా, సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ ఎదురవుతున్నాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఎడిట్ చేసి వాడుకుంటున్నారని, తాను చేసిన అవినీతి ఆరోపణలను పక్కన పెట్టి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు సాగునీరు, వ్యవసాయంపై మంచి అభిప్రాయం లేదని, తాను పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.
ఎంత వివరణ ఇచ్చుకున్నా, జరిగిన డ్యామేజ్ వల్ల పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు సొంత పార్టీ నేతల అసహనం, మరోవైపు అధికార పార్టీ నేతల రివర్స్ అటాక్‌తో విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి.








