చౌటుప్పల్‌, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ డివిజన్‌లోని భూదాన్‌ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల సమీపంలో ఉన్న హజేలో ల్యాబరేటరీస్‌ పరిశ్రమలో శుక్రవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో రియాక్టర్‌ ఒక్కసారిగా పేలడంతో పరిశ్రమలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో రియాక్టర్‌ వద్ద రాత్రి షిఫ్ట్‌లో కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. చాలా మంది గాయపడినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అయితే పరిశ్రమలో మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు సమాచారం. లోపలికి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయలేని పరిస్థితి నెలకొంది.

హజేలో ల్యాబరేటరీస్‌లో గతంలోనూ రియాక్టర్‌ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఘటనలో పరిశ్రమ మేనేజర్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే తరహా ప్రమాదం జరగడంతో పరిశ్రమ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిశ్రమలో భద్రతా నిబంధనలు పాటించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉత్పత్తులు చేపట్టడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాజమాన్యం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది వరకు మృతి చెంది ఉండవచ్చని స్థానికులు చెబుతున్నప్పటికీ అధికారికంగా మృతుల సంఖ్య నిర్ధారణ కాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.