అమెరికాలో H-1B వీసాపై పనిచేసే నిపుణుల జీవిత భాగస్వాములకు ప్రస్తుతం అందుతున్న H-4 వర్క్ పర్మిట్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. H-1B వీసాదారులు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేందుకు వీలుగా వారి జీవిత భాగస్వాములు 'ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD)' అనే ఉద్యోగ అనుమతి పత్రాన్ని పొందుతున్నారు. ఈ EAD ఉన్నవారు మాత్రమే అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగం చేసే అవకాశం ఉంది.

ఈ ప్రతిపాదనను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) తెరపైకి తెచ్చింది. ఉద్యోగ అనుమతికి అర్హులైన విదేశీయుల జాబితా నుంచి H-4 జీవిత భాగస్వాములను తొలగించాలనేది ఈ ప్రతిపాదన ఉద్దేశ్యం. దీనికి సంబంధించి ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ వెబ్‌సైట్‌లో RIN: 1615-AD14 అనే సంఖ్యతో వివరాలను పొందుపరిచారు.

2014 నుంచి 2017 మధ్య కాలంలో నమోదైన దరఖాస్తులను పరిశీలిస్తే, 93 శాతం మంది దరఖాస్తుదారులు భారతీయులేనని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 94 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన ద్వారానే ఈ H-4 EAD సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

అయితే, ఈ ప్రతిపాదన ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ప్రభుత్వం దీనిని అమలు చేయాలంటే ముందుగా 'ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రతిపాదిత నిబంధనపై నోటీసు (NPRM)'ను ప్రచురించి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ తర్వాతే తుది నిబంధనను ప్రకటించాల్సి ఉంటుంది. అప్పటివరకు ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే EAD ఉన్నవారు తమ ఉద్యోగాలను కొనసాగించవచ్చు.

మరోవైపు, H-1B వీసా నిబంధనలను కఠినతరం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకునే నిపుణుల కోసం 1,03,265 డాలర్ల కొత్త రుసుము విధించాలని DHS ప్రతిపాదించింది. అంతేకాదు, ఉద్యోగం కోల్పోయిన H-1B నిపుణులు కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవడానికి ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును కూడా తొలగించే ప్రతిపాదనకు వైట్‌హౌస్ ఆమోదం తెలిపింది.