విందూరు గ్రామానికి చెందిన 21 ఏళ్ల షాహూల్, సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి మరణించగా, తల్లి కువైట్‌లో పని చేస్తోంది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిద్దెపై షాహూల్ ఉన్నట్లు సమాచారం.
శనివారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, మిద్దెపై రక్తపు మడుగులో పడి ఉన్న షాహూల్‌ను చూసి భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా, దుండగులు షాహూల్ గొంతు కోయడమే కాకుండా, అతని మర్మాంగాన్ని కోసి జేబులోనే ఉంచినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై గూడూరు రూరల్ సీఐ కిశోర్ బాబు మాట్లాడుతూ, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ చేపడతామని తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలకు సెలవు ప్రకటించారు.
మరోవైపు రాచానపల్లి గ్రామంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న సురేష్ అనే వ్యక్తి, తన ప్రియురాలి కుమార్తెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీనిని అడ్డుకున్న సదరు మహిళ, కత్తితో సురేష్ మర్మాంగంపై దాడి చేసింది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న సురేష్‌ను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు.








