నస్పూర్‌లోని శ్రీరాంపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న జెట్టి నవీన్, తాండ్ర అక్షితరాణిని ప్రేమ పేరుతో నమ్మించాడు. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న నవీన్, అక్షిత ఫోన్‌లో రహస్యంగా ఒక యాప్ (ఫోన్ సమాచారాన్ని ఇతరులకు పంపే సాఫ్ట్‌వేర్) ఇన్‌స్టాల్ చేసి ఆమె కదలికలను గమనించేవాడు. అక్షిత మరొక వ్యక్తితో చనువుగా ఉండటం నచ్చక, ఆమెను అంతం చేయాలని నవీన్ పథకం వేశాడు.
ఈ నెల 12న స్నేహితుడి దగ్గర గడ్డిమందు సేకరించిన నవీన్, అక్షితకు ఫోన్ చేసి రామగుండంలోని ఎఫ్‌సీఐ అడ్డరోడ్డు వద్దకు పిలిపించాడు. తన కారులో ఎక్కించుకుని, రవికుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదయ్యేలా చేస్తానని నమ్మించి ఆమెతో బలవంతంగా గడ్డిమందు తాగించాడు. ఆ తర్వాత రవికుమార్ వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్లు అక్షితతో ఒక లేఖ రాయించి, ఆ లేఖను ఫోటో తీసి ఆమెను అక్కడే వదిలేశాడు.
అక్షిత రాసిన లేఖ ఆధారంగా పోలీసులు మొదట దీనిని ఆత్మహత్యగా భావించి రవికుమార్‌పై కేసు నమోదు చేశారు. అయితే, ఎఫ్‌సీఐ అడ్డరోడ్డు వద్ద ఉన్న సీసీటీవీ (నిఘా కెమెరా) ఫుటేజీలో అక్షిత నవీన్ కారు ఎక్కిన దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసులు నవీన్ కాల్ డేటా, రికార్డింగ్‌లను విశ్లేషించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌తో పాటు బొమ్మకంటి రవికుమార్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నవీన్‌కు చెందిన కారు, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రవికుమార్‌పై వచ్చిన ఆరోపణలతో పాటు, సింగరేణి అధికారుల నిర్లక్ష్యంపై కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు.








