మర్చంట్ నేవీలో పనిచేసే సౌరభ్ రాజ్పుత్ హత్య కేసులో ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాలను మీరట్ జిల్లా కోర్టు బుధవారం దోషులుగా తేల్చింది. 13 నెలల కాలంలో 126 విచారణల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడింది. నిందితులు ఇద్దరూ తాము ఉన్న స్థానిక జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నారు.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ (ప్రభుత్వ పక్షాన వాదించే న్యాయవాదులు) 22 మంది సాక్షులను కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఇందులో నీలిరంగు డ్రమ్ కొనుగోలు చేసిన వ్యక్తి, మందుల విక్రేత, సిమెంట్ కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు కత్తి, పాత్రలు కొనుగోలు చేసిన వ్యక్తులు ఉన్నారు. ఈ డ్రమ్ హత్య కేసులో కీలక సాక్ష్యంగా నిలిచింది.

ప్రభుత్వ న్యాయవాది కృష్ణ కుమార్ చౌబే మాట్లాడుతూ, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టుకు గుర్తు చేశామని చెప్పారు. సమాజంలో చట్టబద్ధ పాలన అమలవుతుందనే సందేశం వెళ్లాలంటే నిందితులకు తగిన శిక్ష పడాలని ఆయన కోరారు. నేరం తీవ్రతను బట్టి నిందితులకు గరిష్ట శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది.

శిక్షను ఖరారు చేసే ముందు దోషులకు తమ వాదనలను కోర్టు ముందు ఉంచే అవకాశం కల్పించామని న్యాయవాది తెలిపారు. మన న్యాయ వ్యవస్థలో నిందితులకు కూడా తమ వాదనను వినిపించే అవకాశం ఉండటం ఒక ముఖ్యమైన అంశమని ఆయన పేర్కొన్నారు. మరణశిక్ష విధించే అధికారం కోర్టుకు ఉన్నప్పటికీ, శిక్షపై తుది నిర్ణయం న్యాయమూర్తిదేనని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం కోర్టు తీర్పులో భాగంగా నిందితులను దోషులుగా నిర్ధారించింది. శిక్ష ఎంత ఉండాలనే అంశంపై 15 రోజుల తర్వాత కోర్టు తన ఉత్తర్వులను ప్రకటించనుంది. అప్పటి వరకు శిక్షపై సమర్పణలను కోర్టు పరిశీలిస్తుంది.