గోదావరి పుష్కరాలు-2027 సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితమైన వాతావరణం కల్పించాలని ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్ పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం డీజీపీ కార్యాలయం నుంచి పుష్కర జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
పుష్కర ఘాట్‌ల వద్ద కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, సీసీటీవీ నిఘా, డ్రోన్ సర్వైలెన్స్ వంటి సాంకేతికతను వినియోగించుకోవాలని ఏడీజీపీ సూచించారు. వీటితో పాటు ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర స్పందన బృందాలను సిద్ధం చేయడం వంటి భద్రతా చర్యలను ముందుగానే పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కర ఘాట్‌కు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు తగినట్లుగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
భక్తుల రద్దీని తట్టుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. భద్రతా ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని పోలీసు శాఖ భావిస్తోంది.








