తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల జారీలో భారీ కోతలు విధించింది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 44వేల మందికి కార్డులిస్తామని ప్రకటించినా, ఇప్పటివరకు 20వేల కార్డులు మాత్రమే జారీ అయ్యాయి. మొత్తం 40వేల దరఖాస్తులు రాగా, వాటిలో 15వేలను ఆమోదించగా, చివరికి సగం మందికే కార్డులు అందాయి.

కొత్త గ్రేడింగ్ విధానం పేరుతో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. 'ఏ' కేటగిరీ పత్రికలను 'బీ'లోకి, 'బీ'లోని వాటిని 'సీ'లోకి మార్చి కోటా తగ్గించారు. గతంలో ఎడిషన్ కేంద్రాల్లో డెస్క్, బ్యూరో కలిపి 8 మందికి కార్డులు ఇచ్చేవారు, ఇప్పుడు అన్ని కలిపి 8కే పరిమితం చేశారు. నియోజకవర్గ కార్డులను పూర్తిగా ఎత్తేయగా, లక్ష జనాభా దాటిన మండలాల్లో రెండు బదులు ఒక్క కార్డు మాత్రమే ఇస్తున్నారు. 60కి పైగా కేబుల్ ఛానల్స్ కు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు, పుణ్యక్షేత్రాల్లోని ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి కార్డులు రాలేదు.

అక్రెడిటేషన్ కార్డు కేవలం గుర్తింపు మాత్రమే. ఈ కార్డులు లేని వారికి గుర్తింపు దూరం కానుంది.

గత కేసీఆర్ ప్రభుత్వం అందరికీ ఒకే రకమైన కార్డులు ఇచ్చి కోటా పెంచితే, ప్రస్తుత ప్రభుత్వం జీవో-252 ద్వారా రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టుల మధ్య విభజన రేఖ గీసింది. దీనిపై ఉర్దూ జర్నలిస్టులు, పలు సంఘాలు హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ల విచారణ పూర్తయ్యే వరకు పాత కార్డుల చెల్లుబాటును పొడిగించాలని కోర్టు ఆదేశించింది. అయితే జనగామ జిల్లాలో అర్హత ఉన్న 288 మందిలో 160 మంది జాబితాను ఇంటెలిజెన్స్ వర్గాలకు పంపి విచారణ చేయించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కమిటీల్లో ఒకే యూనియన్ వర్గీయులను నియమించడంతో నియంతృత్వం నడుస్తుందని, ఏకపక్షంగా కార్డులు జారీ చేస్తున్నారని టీడబ్ల్యూజేఎఫ్ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న సోమవారం సమాచార భవన్ ను ముట్టడించి నిరసన తెలియజేస్తామని టీడబ్ల్యూజేఎఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాంచందర్ ప్రకటించారు.