గద్వాల జిల్లా కొత్తపల్లికి చెందిన తరుణ్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గత శనివారం తరగతి గదిలో ఒక మహిళా లెక్చరర్, మరో విద్యార్థితో పోలుస్తూ తరుణ్‌ను అందరి ముందు హేళన చేసింది. దీనిని తరుణ్ ప్రశ్నించగా, ఆ లెక్చరర్ అతడిని చెంపపై కొట్టింది. ఈ పరాభవాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన తరుణ్, తన చావుకు కారణమైన లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరివేసుకున్నాడు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, తరుణ్ తమకు ఫిర్యాదు చేయగా లెక్చరర్‌ను మందలించామని, అయితే ఇంతలోనే ఈ ఘటన జరగడం బాధాకరమని తెలిపారు.
మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెన గ్రామానికి చెందిన కృష్ణవేణి, నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కృష్ణవేణి, ఈ ఏడాది నీట్ రాసింది. ఫలితాల్లో ఆశించిన మార్కులు రాకపోవడంతో డాక్టర్ సీటు రాదని ఆందోళన చెందిన ఆమె, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను మహదేవపూర్, భూపాలపల్లి ఆసుపత్రుల మీదుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.
విద్యార్థుల ప్రతిభను కేవలం మార్కులతోనే అంచనా వేయడం వల్ల వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగానే విద్యార్థులు తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కుల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.








