పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యవహరిస్తున్నారు. హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే శనివారం అర్ధరాత్రి సమయంలో ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. యుద్ధ విమానాలు మరియు డ్రోన్ల సాయంతో నబటియే ప్రాంతంలోని నివాస భవనాలను ధ్వంసం చేసిన ఈ దాడుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేందుకు అమెరికా మరియు ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) లెక్కచేయకుండా ఇజ్రాయెల్ మరియు హెజ్‌బొల్లా పరస్పరం భీకర దాడులకు పాల్పడ్డాయి. దీంతో స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా శుక్రవారం ప్రారంభం కావాల్సిన సంప్రదింపులు వాయిదా పడ్డాయి. యూఎస్ మరియు ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరువర్గాలు కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, అది ఎంతకాలం కొనసాగుతుందనే విషయంలో అనిశ్చితి నెలకొంది.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించాలని తాను ఇజ్రాయెల్‌ను వ్యక్తిగతంగా కోరానని, సంయమనం పాటించాలని ఆ దేశ అధికారులపై ఒత్తిడి తెచ్చానని ఆయన తెలిపారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే ఇరాన్‌తో శాంతి ఒప్పందం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించిన ట్రంప్, ఇజ్రాయెల్ కొంచెం బుర్ర ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలని, ప్రశాంతంగా ఉండాలని సూచించినట్లు సమాచారం.







