డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు పంపింది. ఈ నెల 14న జరిగిన విచారణకు జానీ మాస్టర్ హాజరుకాకపోవడంతో ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఇటీవల జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ముంబై డ్యాన్సర్లను తీసుకురావడంపై జానీ మాస్టర్‌పై ఆరోపణలు రావడంతో డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత స్పందించారు. అసోసియేషన్‌లో అవినీతి జరుగుతోందని, తమను ప్రశ్నిస్తున్నందుకే ఇలా చేస్తున్నారని ఆమె మీడియా ముందు ఆరోపించారు. ఫెడరేషన్ ఇష్టానుసారంగా నిబంధనలు రుద్దుతోందని, ఇంటి దొంగలను సమర్థిస్తోందని జానీ మాస్టర్, సుమలత విమర్శలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జానీ మాస్టర్ బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, ఫెడరేషన్ తరపున సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించింది. సుమలత తీరుపై కూడా ఫెడరేషన్ అసహనం వ్యక్తం చేస్తూ, జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.
డ్యాన్సర్ల ఉపాధికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ సూచించింది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు జానీ మాస్టర్, సుమలతలకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని ఫెడరేషన్ తెలిపింది. దీనిపై జానీ మాస్టర్ మరియు సుమలత ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.








