భారతీ ఎయిర్‌టెల్ బిజినెస్ విభాగం, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఐటీఐ లిమిటెడ్‌తో కలిసి పని చేయనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా వివిధ సంస్థలకు అవసరమైన డిజిటల్ సేవలను ఉమ్మడిగా అందించనున్నారు. ముఖ్యంగా డిఫెన్స్ రంగంతో సహా పబ్లిక్ సెక్టార్‌లో తన ఉనికిని పెంచుకోవాలని ఎయిర్‌టెల్ బిజినెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీఐ లిమిటెడ్ కోటాను వినియోగించుకోవడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని సంస్థ భావిస్తోంది.

ఈ ఒప్పందంలో భాగంగా ఎంటర్‌ప్రైజ్ కనెక్టివిటీకి సంబంధించి ఓఎఫ్‌సి, జీపీఓఎన్, ఎస్‌డి-వాన్, ప్రైవేట్ 4జి/5జి సేవలను అందించనున్నారు. వీటితో పాటు సురక్షిత డేటా సెంటర్, సావరిన్ క్లౌడ్ సేవలు, ఇండస్ట్రియల్ ఐఒటి, ఏఐ-ఆధారిత అనలిటిక్స్ మరియు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకింగ్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల వంటి కఠినమైన నిబంధనలు కలిగిన రంగాలపై కూడా ఈ కంపెనీలు ప్రత్యేక దృష్టి సారించనున్నాయి.

ఐటీఐ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ రాయ్ మాట్లాడుతూ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, వేగవంతమైన కనెక్టివిటీ, హైపర్ స్కేల్ డేటా సెంటర్లు మరియు సైబర్ సెక్యూరిటీ అవసరాలను తీర్చేందుకు ఈ సహకారం దోహదపడుతుందని పేర్కొన్నారు. భారత్ డిజిటల్ వృద్ధిలో రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఉండే టెక్నాలజీ సొల్యూషన్స్ అవసరమని ఎయిర్‌టెల్ బిజినెస్ సీఈఓ శరత్ సిన్హా తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా భవిష్యత్‌కు సిద్ధమైన టెక్నాలజీ సేవలను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.