ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. జెండా ఆవిష్కరణ సమయంలో 1721 ఫీల్డ్ బ్యాటరీ (సెరిమోనియల్) సైనిక దళాల గన్నర్లు 21 తుపాకుల సెల్యూట్ ఇచ్చి గౌరవ వందనం సమర్పించారు.
ఈ ఏడాది వేడుకల్లో భాగంగా స్వాతంత్ర్య పోరాటంలో కీలకమైన వందేమాతరం గేయాన్ని ఎర్రకోటపై తొలిసారిగా అధికారికంగా ఆలపించారు. ఈ గేయం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని నిర్వహించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో యువత పాత్రపై ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
ప్రధాని మోడీ తన ప్రసంగంలో దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు. కష్టకాలంలో బాధితులకు దేశం అండగా ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు.







