ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాబ్ క్యాలెండర్-2026 అమలుపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నియామక ప్రక్రియను ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

మొత్తం 10,060 పోస్టులను నాలుగు దశల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండో దశలో 3,168 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, సాంకేతిక కారణాల వల్ల స్వల్ప ఆలస్యం జరిగినప్పటికీ, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ తేదీని ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు.

మూడవ మరియు నాలుగవ దశలకు సంబంధించి అక్టోబర్ 15న నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మూడవ దశలో 2,388 పోస్టులు, నాలుగవ దశలో 2,981 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు హోంశాఖలో 2,225 ఖాళీలను భర్తీ చేసి పోలీసు, భద్రతా విభాగాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టుల సంఖ్యను పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై మంత్రుల కమిటీ అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు సమాచారం. జాబ్ క్యాలెండర్-2026కు సంబంధించిన పూర్తి స్థాయి ఖాళీల వివరాలను తదుపరి కేబినెట్ సమావేశంలో సమర్పించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.