కోల్‌కతాలో బుధవారం జరిగిన టీఎంసీ విద్యార్థి, యువజన విభాగాల ర్యాలీ ముగింపు దశలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అంబులెన్స్‌కు దారి కల్పించేందుకు ముందుకు వచ్చిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ సమయంలో ఏర్పడిన గందరగోళంలో ఓ పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి.

బారుయిపూర్‌లో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా బాలిగంజ్ ఫారి నుంచి హజ్రా వరకు ఈ ర్యాలీ సాగింది. కలకత్తా హైకోర్టు అనుమతితో నిర్వహించిన ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే అక్కడ ఒక్కసారిగా పరిస్థితులు అదుపు తప్పాయి. గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లు రావడంతో, దారి కల్పించే క్రమంలో భద్రతా సిబ్బంది, నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.

వీడియోలో మమతా బెనర్జీ తనకు అతి సమీపంలో ఉన్న వ్యక్తి వైపు చేయి ఎత్తినట్లు కనిపిస్తోంది. అనంతరం భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లగా, మమతా బెనర్జీ ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయారు. అంబులెన్స్‌కు దారి చేయడంలో ఏర్పడిన గందరగోళంలో ఈ ఘటన అనుకోకుండా జరిగి ఉండవచ్చని సమాచారం అందింది.

అయితే ఈ వీడియో ప్రామాణికతను స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు. మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగానే కార్యకర్తను కొట్టారా లేక గందరగోళంలో అనుకోకుండా జరిగిందా అనే విషయంపై అధికారిక స్పష్టత లేదు. ఈ ఘటనపై టీఎంసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.