కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, యువతను, నిరుద్యోగులను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం సగం పదవీకాలం పూర్తికాకముందే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్‌ఎస్ వరుసగా సభలు నిర్వహిస్తోంది.

ఈ క్రమంలోనే వరంగల్ రైతు సభ తర్వాత, ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో యువత, విద్యార్థులతో భారీ యువజన సదస్సును నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నివాసంలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో సభ ఏర్పాట్లపై ఆయన చర్చించారు. హైదరాబాద్‌తో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి యువత పెద్ద సంఖ్యలో తరలివస్తారని పార్టీ నేతలు కేటీఆర్‌కు వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు, పాలన ప్రజాకంటకంగా మారాయని కేటీఆర్ ఆరోపించారు. సీఎం చేయించిన సర్వేలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న తరుణంలో సీఎం వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని, రైతులు సైతం నీటి కోసం డిమాండ్ చేసే పరిస్థితికి ప్రభుత్వం దారితీసిందని ఆయన విమర్శించారు.

యువ సంగ్రామ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. అటువంటి ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన సూచించారు.