దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను సరిచేసే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం (EC) లోపల తీవ్ర విభేదాలు ఉన్నాయని జాతీయ పత్రిక 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనాన్ని ప్రచురించింది. గత పది నెలల్లో తమకు తెలియకుండానే పలు ఉత్తర్వులు జారీ అయ్యాయని, నిబంధనలు మార్చారని ఎన్నికల కమిషనర్లు సుఖీబీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి అభ్యంతరం వ్యక్తం చేశారని ఆ కథనం పేర్కొంది.
ఈ వార్త రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఎస్ఐఆర్‌తో సహా తీసుకున్న అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదంతో ఏకగ్రీవంగానే జరిగాయని ఈసీ స్పష్టం చేసింది. కమిషనర్ల మధ్య వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉండటం సహజమని, అయితే తుది నిర్ణయాలు మాత్రం ముగ్గురి అంగీకారంతోనే తీసుకుంటామని తెలిపింది.
ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు కోసం వాడే ఫారమ్-6 మార్పులు, ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణ వంటి అంశాలపై కమిషనర్లు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారని ఈసీ పేర్కొంది. ఇవి కేవలం అంతర్గత చర్చల్లో భాగంగా జరిగినవేనని, వీటిని విభేదాలుగా చూడకూడదని వివరించింది. ఈసీ తీసుకున్న నిర్ణయాల్లో ఎటువంటి అక్రమాలు లేవని సంస్థ స్పష్టం చేసింది.
ఈ పరిణామంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రధాని మోడీ ఆదేశాల మేరకే జ్ఞానేష్ కుమార్ పనిచేస్తున్నారని, రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్ని బీజేపీ తన ఆధీనంలోకి తీసుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
జ్ఞానేష్ కుమార్ నియంతలా వ్యవహరిస్తున్నారని, మోడీని సంతోషపెట్టేందుకు ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రజాస్వామ్యానికి వీరు తీవ్ర నష్టం కలిగించారని, సమయం వచ్చినప్పుడు వీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ వివాదంపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.








