దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అయిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై సీఈసీ (CEC) అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రజలకు వివరణ ఇవ్వాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కోరారు. పాట్నాలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కమిషన్ పైనే ఉందని గుర్తుచేశారు.

ఎన్నికల కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక నివేదిక వెల్లడించడంతో ఈ వివాదం మొదలైంది. గత పది నెలల్లో సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అనే ఇద్దరు ఎన్నికల కమిషనర్లు SIR ప్రక్రియపై 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఆ నివేదిక పేర్కొంది. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, సాఫ్ట్‌వేర్ యాక్సెస్ వంటి అంశాలపై వారు అభ్యంతరాలు తెలిపినట్లు సమాచారం.

ఈ నివేదికతో ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఓటర్ల హక్కులను కాపాడటంలో కమిషన్ విఫలమైందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆరెస్సెస్, బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎన్డీఏ కూటమిలోని మరో మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా ఓటర్ల గందరగోళాన్ని తొలగించేలా కమిషన్ స్పందించాలని ఎక్స్‌లో కోరారు.

మరోవైపు, ఎన్నికల కమిషన్ లో అంతర్గత చర్చలు జరగడం సహజమని, అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగానే తీసుకున్నామని కమిషన్ స్పష్టం చేసింది. బీహార్‌లో మొదలై ఇతర రాష్ట్రాలకు విస్తరించిన ఈ SIR ప్రక్రియ ద్వారా డ్రాఫ్ట్ జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకం తగ్గకుండా కమిషన్ తన వైఖరిని మరింత బలంగా వ్యక్తం చేయాలని మిత్రపక్షాలు కోరుతున్నాయి.