ఎన్నికల కమిషన్‌లో కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయని, గత 10 నెలల్లో ఓటర్ల నమోదు, తొలగింపు వంటి అంశాలపై 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ (EC), అంతర్గత చర్చల్లో భిన్నాభిప్రాయాలు సహజమని, చివరకు అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగానే తీసుకున్నామని తెలిపింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ, కాక్రోచ్ పార్టీ సీజేపీ ఆయనకు 48 గంటల గడువు ఇచ్చింది. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా భారీగా ఉద్యమిస్తామని ఆ పార్టీ హెచ్చరించింది.
నిజానికి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించడం అంత సులభం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలోనే సీఈసీని కూడా తొలగించాలి. ఆయన అసమర్థుడిగా లేదా చెడుగా ప్రవర్తిస్తున్నారని నిరూపితమైతేనే ఈ ప్రక్రియ మొదలవుతుంది. భారత చరిత్రలో ఇప్పటివరకు ఏ సీఈసీని కూడా ఈ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా తొలగించలేదు.
ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్‌కు నోటీసులు ఇవ్వాలి. ఈ ప్రతిపాదనపై లోక్‌సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది ఎంపీల సంతకాలు అవసరం. ఆ నోటీసులను స్వీకరించాలా వద్దా అని సభాపతులు నిర్ణయిస్తారు. ఆమోదం లభిస్తే, విచారణ కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి, ఒక న్యాయనిపుణుడితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తారు.
ఈ కమిటీ ఆరోపణలపై విచారణ జరిపి ఆధారాలను పరిశీలిస్తుంది. ఈ సమయంలో సీఈసీ తన వాదనను వినిపించే అవకాశం ఉంటుంది. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే, పార్లమెంటు ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాలి. చివరగా రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే సీఈసీ పదవి నుంచి తొలగింపబడతారు.








