DSC పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై తక్షణమే సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) విచారణ చేపట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెలంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలోని 35వ డివిజన్ అంబెద్కర్ విగ్రహం వద్ద పార్టీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ అంశంపై స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

ఈ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వెలంపల్లి శ్రీనివాస్ కోరారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు, అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా వాటిని విస్మరించారని ఆయన ఆరోపించారు. యువత భవిష్యత్తు కోసం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరులు దాడి చేయడం అమానుషమని ఆయన పేర్కొన్నారు.

తనను ఉద్దేశించి బోండా ఉమా అసభ్య పదజాలం వాడారని, బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని వెలంపల్లి స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు పుట్టిన జాతిలో తాను జన్మించానని, సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మేయర్ రాయల భాగ్యలక్ష్మి, రూహుల్లా, బండి నాగేంద్ర, పుణ్యశీల, ఆసిఫ్, గౌస్ మహుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.