డ్రై ఫ్రూట్స్‌లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. అయితే, వీటిలో సహజంగానే చక్కెర, కేలరీలు అధికంగా ఉండటం వల్ల, వీటిని పరిమితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.
ఆరోగ్య సంస్థల నిపుణుల సిఫార్సుల ప్రకారం, పెద్దలు రోజుకు 30 నుంచి 40 గ్రాముల వరకు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అమెరికాకు చెందిన US FDA నిపుణులు 40 గ్రాముల వరకు తీసుకోవచ్చని సూచిస్తుండగా, బ్రిటన్‌కు చెందిన NHS 30 గ్రాములను సిఫార్సు చేస్తోంది. భారతీయ పోషకాహార నిపుణులు మాత్రం మీ రోజువారీ శారీరక శ్రమను బట్టి 20 నుంచి 30 గ్రాములు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. గుండె ఆరోగ్యం కోసం తీపి కలపని, రసాయనాలు లేని డ్రై ఫ్రూట్స్‌ను రోజుకు 30-40 గ్రాముల వరకు తీసుకోవడం ఉత్తమం.
మీరు తీసుకునే డ్రై ఫ్రూట్స్ పరిమాణాన్ని ఇలా అంచనా వేయవచ్చు: ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష, రెండు ఎండిన అంజూర పండ్లు, మూడు ఎండు ఖర్జూరాలు లేదా ఒక చిన్న గుప్పెడు నట్స్ ఒక మోతాదుగా పరిగణించవచ్చు. కేవలం 30 గ్రాముల డ్రై ఫ్రూట్స్‌లోనే 80 నుండి 100 పైగా కేలరీలు ఉంటాయి.
పండ్లను ఎండబెట్టడం వల్ల వాటిలోని నీరు ఆవిరై, చక్కెర గాఢత పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు వీటిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఇవి జిగటగా ఉండటం వల్ల తిన్న తర్వాత నోరు సరిగ్గా కడుక్కోకపోతే దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.








